తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పధకంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. సీఎం జగన్ మరింత ముందుకెళ్లి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని కొనియాడారు. చంద్రబాబు హయాంలో ఉండిపోయిన బకాయిలు సైతం సీఎం జగన్ చెల్లించారని అన్నారు. ప్రజలు, విద్యార్థులు.. వారి సమస్యల పట్ల సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. చంద్రబాబుకు ఓట్లు, అధికారం తప్ప ప్రజల సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక.. వంటి పధకాలెన్నో తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని అన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తూ.. బడుగు, బలహీనవర్గాలు విద్యలో రాణించేలా చేస్తున్నారని మంత్రి అన్నారు.