దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ ఒక రోజు వర్క్ షాప్ లో భాగంగా నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖకు జ్యూవెల్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరుందని విశ్వ నగరంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న నగరమని మంత్రి అన్నారు. ఈస్ట్ నావెల్ బేస్ కు ముఖ్య కేంద్రంతోపాటు సముద్ర రవాణా, పోర్ట్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న నగరమని అన్నారు. స్వాతంత్రం తర్వాత దేశ రక్షణ రంగంలో విశాఖ ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించే వేదికను విశాఖలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళ్తోందని.. భవిష్యత్తులో ఈ రంగంలో రాష్ట్రాన్ని ప్రముఖంగా నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇక్కడ రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన విశాఖపట్నం ప్రముఖ నగరంగా భాసిల్లుతుందని అన్నారు. ఐటీ పరిశ్రమకు కూడా విశాఖ నగరం ఎంతో అనుకూలమైందని.. ఈ రంగంలో నగరాన్ని ప్రముఖంగా నిలిపేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పన కూడా పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.